ys jagan sorting out with ap employees
Telecast Date: 01-08-2023 Category: Political Publisher:  SevenTV

 

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో ఉద్యోగులను మంచి చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుంది. అందుకనే ఉద్యోగుల డిమాండ్లను తీర్చటంలో ప్రభుత్వం ఆసక్తిని చూపిస్తోంది. ఉద్యోగసంఘాల నేతలతో మంత్రులు పదేపదే భేటీ అవుతున్నారు. సమస్యలను వినటానికి గంటల కొద్ది సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇదంతా దేనికంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి ఎన్నికల్లో గెలవటానికి ఉద్యోగుల సహకారం అవసరమే లేదని ప్రభుత్వం మొదటినుండి అభిప్రాయపడుతోంది.

అయితే అనవసరంగా ఉద్యోగులను దూరంచేసుకోవటం, వైరం పెంచుకోవటం ఎందుకనే భావన మొదలైనట్లుంది. అందుకనే ఆర్ధిక పరమైన డిమాండ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఆర్ధికేతర డిమాండ్ల విషయంలో మాత్రం పరిష్కారానికి స్పీడుగా పరిగెత్తుతోంది. ఈనెల 21,22 తేదీల్లో విజయవాడలో జరగబోయే ఏపీ ఎన్జీవో రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు జగన్ ఓకే చెప్పారు. ఈ విషయాన్ని ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ చెప్పారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు బొత్సా సత్యనారాయణ పాల్గొన్నారు.

మహాసభల సందర్భంగా జగన్ వచ్చినపుడు ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలన్నింటినీ ప్రస్తావించి తగిన హామీలు తీసుకుందామని బండి అన్నారు. నిజానికి ఆర్ధిక అంశాలను పరిష్కరించటానికి ప్రభుత్వం దగ్గర తగినంత డబ్బులేదు. అందుకనే ఆర్ధిక ప్రయోజనాలను అమలుచేయటంలో ప్రభుత్వం వీలైనంత సమయాన్ని తీసుకుంటోంది. ఈ విషయం ఉద్యోగుల సంఘాల నేతలకు, ఉద్యోగులకు కూడా బాగా తెలుసు.

ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళే కీలకం కదా. ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి ఉద్యోగులకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఇంకెవరుంటారు. ఉద్యోగులు సుమారు 5 లక్షలమంది ఉంటారు. అలాగే రిటరైన ఉద్యోగులు మరో 4 లక్షలుంటారు. అంటే మొత్తం 9 లక్షల మంది అన్నట్లు. ఈ 9 లక్షల కుటుంబాల్లో కనీసం రెండు ఓట్లను వేసుకున్నా సుమారు 20 లక్షల ఓట్లవుతారు. ఇన్ని లక్షల ఓట్లను ఏ ప్రభుత్వం కూడా పోగొట్టుకోదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జగన్ ఉద్యోగులతో మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకనే ఆర్ధిక డిమాండ్లను కొన్నింటిని, ఆర్ధికేతర డిమాండ్లను పూర్తిగా పరిష్కరించటంలో దృష్టిపెట్టినట్లున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading