
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మల్లారెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. సీరియస్ రాజకీయాల్లో ఆయన తనదైన శైలిలో మాట్లాడుతూ నవ్వులు పూయిస్తుంటారు. పంచ్ డైలాగులతో ప్రజలనే కాకుండా, రాజకీయ నాయకులను సైతం ఆయన ఆకట్టుకుంటుంటారు. పాలు అమ్మాను, పూలు అమ్మాను, బోర్ వెల్ నడిపించాను, ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ గతంలో ఆయన చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
తాజాగా మల్లారెడ్డి గురించి ఒక వార్త ప్రచారం అవుతోంది. ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారనేదే ఆ వార్త. ఒక ఏడాది వ్యవధిలో నాలుగు సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ నాలుగు సినిమాలు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయని చెపుతున్నారు. దీని గురించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగిన సమయంలోనే మల్లారెడ్డి సినీ పరిశ్రమలో తన ఎంట్రీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఓటీటీకి ఆదరణ పెరిగిందని... తాను కూడా ఓటీటీ సంస్థను ప్రారంభించి సినిమాలను చేస్తానని చెప్పారు. తొలి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తానని తెలిపారు. మీతో సినిమా చేస్తానన్నా అని చిరంజీవిని అడిగితే... పక్కనే ఉన్న చిరు కూడా ఓకే చెప్పడం గమనార్హం.
|