mohammed shami breaks multiple records in kiwis match
Telecast Date: 16-11-2023 Category: Sports Publisher:  SevenTV

 

న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అత్యద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 9.5 ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి ఏడు వికెట్లు నేలకూల్చాడు. ఈ దెబ్బతో అతడి ఖాతాలోకి బోల్డన్ని రికార్డులు వచ్చి చేరాయి. అవేంటో చూద్దామా..

* వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్. మొత్తంగా చూసుకుంటే ఏడో బౌలర్. అతడికంటే ముందు గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్, మిచెల్ స్టార్క్, లసిత్ మలింగ, వాసిం అక్రం, ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు. 
* వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన తొలి బౌలర్. కేవలం 17 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు మిచెల్ స్టార్క్ ఈ ఘనత సాధించాడు. స్టార్క్ 19 ఇన్నింగ్స్‌లలో 50 వికెట్లు పడగొట్టాడు. 
* ప్రపంచకప్ నాకౌట్ మ్యాచుల్లో షమీ 48 ఏళ్ల నాటి రికార్డును బద్దలుగొట్టాడు. 1975లో లీడ్స్‌లోని హెడింగ్లీలో జరిగిన ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్యారీ గిల్మౌర్ 12 ఓవర్లు వేసి 6 మెయిడెన్లు వేసి 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.  ఇప్పుడా రికార్డును షమీ తుడిచిపెట్టేశాడు.
* వన్డేల్లో షమీ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నెలకొల్పిన ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో స్టువార్ట్ బిన్నీ 2014లో మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై నెలకొల్పిన రికార్డును బద్దలుగొట్టాడు. ఆ మ్యాచ్‌లో బిన్నీ 4.4 ఓవర్లు వేసి రెండు మెయిడెన్లు తీసుకుని 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.   
* ప్రపంచకప్‌లో ఎక్కువసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు. నాలుగుసార్లు అతడు ఈ ఘనత సాధించాడు. ఆసీస్ బౌలర్ స్టార్క్ 26 మ్యాచుల్లో మూడుసార్లు ఐదువికెట్లు పడగొట్టాడు. 
* ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ కూడా షమీనే. మూడుసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా, గ్యారీ గిల్మౌర్ (1975), అశాంత డె  మెల్ (1983), వాస్‌బెర్ట్ డ్రాక్స్(2003), షాహిద్ ఆఫ్రిది (2011), ముస్తాఫిజుర్ రహ్మాన్ (2019) రెండేసి సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టారు. 
* ప్రపంచకప్‌ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్ షమీనే. 2011లో జహీర్‌ఖాన్‌ 9 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. 
* న్యూజిలాండ్‌పై అత్యుత్తమ ఫిగర్స్ ఇవే. 2002లో పాక్ పేసర్ షోయబ్ అక్తర్ 9-11-16-6తో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఇప్పుడు దానిని షమీ చెరిపేశాడు. 
* ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన ఐదో బౌలర్ షమీ. గతంలో గ్లెన్ మెక్‌గ్రాత్, ఆండీ బిచెల్, టిమ్ సౌథీ, విన్‌స్టన్ డేవిస్ ఏడేసి వికెట్లు తీసుకున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading