
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్ సీరియస్ గా స్పందించింది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ను ప్రశంసిస్తూ, అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును విమర్శించడం సిగ్గుచేటని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది. ‘‘అమెరికా మాజీ అధ్యక్షుడైన వ్యక్తి ఇజ్రాయెల్ పౌరులు, పోరాట యోధుల స్ఫూర్తిని కించపరిచేలా, ప్రచారానికి ఊతమిచ్చేలా మాట్లాడడం సిగ్గు చేటు’’అని ఇప్రాయెల్ కమ్యూనికేషన్ల మంత్రి ష్లోమో పేర్కొన్నారు.
బుధవారం వెస్ట్ పామ్ బీచ్ లో జరిగిన ర్యాలీలో భాగంగా ట్రంప్ ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇజ్రాయెల్ బలహీనతలను బహిరంగ పరిచినందుకు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఆయన విమర్శించారు. ఇది హిజ్బుల్లా దాడులకు ప్రేరేపించినట్టు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ శత్రువుగా భావించే హిజ్బుల్లాను ఎంతో స్మార్ట్ గా అభివర్ణించారు. ‘‘నేతన్యాహు భంగపడ్డారు. అయన సన్నద్ధంగా లేరు. ఇజ్రాయెల్ సన్నద్ధంగా లేదు’’అని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఇజ్రాయెల్ పై ఉగ్రదాడిని ముందుగానే పసిగట్టి, నిరోధించేవాడినన్నారు.
|