chandrababu lashes out at ys jagan and ysrcp
Telecast Date: 18-08-2023 Category: Political Publisher:  SevenTV

 

 

జగన్ పాలనలో అన్నదాతలు అన్ని విధాలుగా దగాపడ్డారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ఏడిద గ్రామంలో రైతులతో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను రైతులను కలవడానికి ముందు వర్షం పడిందని, ఇది శుభసూచకమన్నారు. కరోనా సమయంలో అన్ని వృత్తులు, వ్యవస్థలు బంద్ అయ్యాయని, కానీ అన్నదాత దేశం కోసం పంటలు పండించి, ఆహారభద్రతకు ముప్పులేకుండా చేశాడన్నారు. అందరిలా రైతులు కూడా విశ్రాంతి తీసుకొని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఊరిలో కాటన్ విగ్రహం ఉంటుందని, బ్రిటీష్ వ్యక్తి అయినా గోదావరి నీటిని ఈ ప్రాంత రైతులకు అందించిన మానవతావాది అని కొనియాడారు. ఈ జిల్లాకు గోదావరి నీళ్లు అందించడం కోసం ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించాడని, అప్పట్లోనే పోలవరం నిర్మాణం చేయాలని భావించి, రూ.129 కోట్లతో అంచనాలు రూపొందించి, శ్రీరామపాద సాగర్ అని పేరు పెట్టారన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదన్నారు. 2014లో తనపై నమ్మకంతో ప్రజలు గెలిపించారని, పోలవరం పూర్తి చేయడానికి తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఏపీలో కలపాలని పట్టుబట్టి సాధించానన్నారు.

పోలవరం నిర్మాణాన్ని 72 శాతం పూర్తి చేశానని, ఈ జాతీయ ప్రాజెక్టు పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు పంటలు పండేవన్నారు. కానీ అలాంటి గొప్ప ప్రాజెక్టును దుర్మార్గుడు, సైకో ముఖ్యమంత్రి అయ్యాక  రివర్స్ టెండరింగ్ అని రివర్స్ పాలనతో నాశనం చేశాడన్నారు. కారు రివర్స్‌లో నడిపితే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో, అంతకంటే ఎక్కువగా రాష్ట్రం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతని రివర్స్ పాలనకు పోలవరం బలైందన్నారు. రైతులకు వరం పోలవరం... అలాంటి ప్రాజెక్ట్‌ను ఈ సైకో నిర్వీర్యం చేశాడన్నారు. ఈ సైకో వచ్చాక చివరి భూములకు నీళ్లు వస్తున్నాయా? కాలువల్లో పూడిక తీయించాడా? కంపచెట్లు తొలగించాడా? ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టాడా? నాలుగేళ్లలో రైతుల గురించి ఒక్కరోజైనా ఆలోచించాడా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

నాడు తాను భూమిసాగు చేసే రైతుల కోసం మూడంచెల విధానం తీసుకొచ్చానని, కాలువల నిర్వహణ, ప్రాథమిక స్థాయిలో సాగునీటి సంఘాలు, వాటిపైన డిస్టిబ్రూషన్ కమిటీలు, ఆ పైన ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ కమిటీ లు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. మొత్తం రైతులకే అధికారమిచ్చానని, ప్రాజెక్టులు, కాలువల నిర్వహణకు డబ్బులు అందించానని, ప్రతి సీజన్‌లో మీరే స్వయంగా పనులు చేసుకొని, చివరి భూముల్లోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించే బాధ్యత మీ రైతుల ద్వారానే సక్రమంగా జరిగేలా చేసినన్నారు. కానీ ఇప్పుడు జగన్ అసమర్థపాలన, చేతగాని దద్దమ్మ పాలన, మూర్ఖఫుపాలన రైతులకు శాపంగా మారిందన్నారు. 23టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్‌కు తరలించేలా పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ నిర్మిస్తే, దానిని కూడా మూలనపడేశాడని మండిపడ్డారు. ఏలేరులో నేటికీ 5, 6 టీఎంసీలకు మించి నీరు లేదని, చాగల్నాడు, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్లను తానే ఏర్పాటు చేశానన్నారు. వాటి నిర్వహణకు డబ్బులివ్వలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడని దుయ్యబట్టారు.

పోలవరం ప్రధాన కుడికాలువపై పట్టిసీమ నిర్మించి, సంవత్సరానికి 80, 90 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు అందించానని, వాటికి ప్రత్యామ్నాయంగా శ్రీశైలంలో నిల్వచేసిన  కృష్ణా నీటిని రాయలసీమకు అందించానన్నారు. ఇప్పుడు శ్రీశైలంలో నీళ్లు లేవని, ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన పట్టిసీమే గతి అయిందన్నారు. ఇంకా భేషజాలకు పోతే ప్రజలు ఎక్కడ తిరగబడతారో అనే భయంతో పట్టిసీమ పంపులు ఆన్ చేయించాడన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలనేవి నిరంతర ప్రక్రియ అని, అయిదేళ్లు అధికారమిస్తారు... ఆ తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వచ్చి నిలబడాల్సిందే అన్నారు. మీరు గెలిపిస్తేనే పరిపాలన చేస్తామన్నారు.

ఈ ఐదేళ్లలో ఒక్క రైతు జీవితమైనా బాగుపడిందా? ఒక్క రైతు అయినా ఆనందంగా ఉన్నాడా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రైతులపై  ఉన్న తలసరి అప్పు రూ.74వేలు అయితే, ఏపీలో ప్రతి రైతుపై ఉన్న తలసరి అప్పు రూ.2,45,000 అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులతో పోలిస్తే మన రాష్ట్ర రైతులు మూడురెట్లు ఎక్కువగా అప్పులు అయ్యారన్నారు. ఈ అప్పులకు కారణం జగన్ రెడ్డి కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నపూర్ణ ఈ గోదావరి ప్రాంతమని, ఇక్కడ వరి పండించే రైతులు ఆనందంగా ఉన్నారా? మీరు పండించిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొన్నారా? అని ప్రశ్నించారు. చేతనైతే రైతుల జీవితాలు మెరుగుపరచాలి.. అంతేగానీ ఆర్బీకేలతో రైతుల్ని రోడ్డునపడేస్తారా? వరదలు, వర్షాలకు ధాన్యం తడిస్తే, దాన్ని కొన్నారా? కొన్న వెంటనే సకాలంలో రైతులకు డబ్బులు ఇచ్చారా? అని నిలదీశారు.

తాను సీఎంగా ఉన్నప్పుడు రైతులు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ధాన్యం అమ్ముకునే అవకాశం ఉందని, ఇప్పుడు ఎక్కడో వీళ్ల పేటీఎమ్ బ్యాచ్‌లో ఒకడికి రైస్ మిల్లు ఉంటంది.. అక్కడే అందరూ ధాన్యం అమ్మాలని ఆరోపించారు. అడిగేవాడు లేకపోతే.. తన్నేవాడు లేకపోతే కొవ్వెక్కి ఇలాంటి పనులే చేస్తారన్నారు. రైతులు అంతదూరం లారీల్లో ధాన్యం తీసుకెళ్తే, వెంటనే ధాన్యం తీసుకోవడం లేదని, అక్కడ రోజుల తరబడి రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటీ తిక్క నిర్ణయాలని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరించే గోతాల్లోనూ అవినీతే అన్నారు. రైతులకు ఇచ్చిన ధాన్యపు గోతాల్లో ధాన్యం తీసుకెళ్లడం వీలవుతుందా? రైతులకు ధాన్యపు గోతాలు ఇవ్వలేని ఈ  అసమర్థుడు మూడు రాజధానులు కడతాడా? అన్నారు.

కోనసీమ కొబ్బరి రైతులు సంతోషంగా ఉన్నారా? కొబ్బరికి గిట్టుబాటు ధర అందిస్తున్నారా? అని నిలదీసిన చంద్రబాబు... బాలయోగి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం కొబ్బరి రైతులకు న్యాయం చేసిందని, ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వాసాగు బాగా పెరిగిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. టీడీపీ హాయాంలో ఆక్వా రైతులకు అన్ని రకాల సబ్సిడీలు అందించామన్నారు. యూనిట్ విద్యుత్ రూ.2కే అందించామని, కానీ జగన్ యూనిట్ రూ.1.50పైసలకే ఇస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. మార్కెట్ సెస్సు 25శాతం ఉంటే, ఇప్పుడు ఒక శాతం పెంచాడన్నారు. 1000 లీటర్ల నీళ్లు రూ.12లకు తాము అందిస్తే జగన్ రూ.120కు పెంచాడన్నారు. ఊరికే వచ్చి గోదావరి నీటి ధరను కూడా పెంచాడన్నారు. ట్రాన్స్ ఫార్మర్ల ధరలు పెంచాడని, ఆక్వాసాగుని వెంటిలెటర్ పైకి చేర్చాడని ఆరోపించారు.

ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి తాను హామీ ఇస్తున్నానని, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఉభయగోదావరి జిల్లా రైతాంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు. రైతుల ఆత్మహత్యల్లో జగన్ రాష్ట్రాన్ని దేశంలోనే మూడో స్థానంలో, కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో నిలిపాడని విమర్శించారు. రాష్ట్రంలో లాభసాటి పంటగా గంజాయి సాగుని మాత్రం మార్చాడని, గంజాయి పండించి, రోజూ తాగిపడుకుంటే రాష్ట్రాన్ని అంధకారం చేయవచ్చుననేది జగన్ ఆలోచన అని ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం రూ.4వేల కోట్లతో ధరలస్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, ప్రకృతి విపత్తుల సహాయనిధి రూ.4వేల కోట్లు ఏర్పాటు చేస్తానన్న జగన్ ఏదీ చేయలేదన్నారు. ఆఖరికి పంటల బీమా సొమ్ము చెల్లించకుండా రైతుల్ని వంచించాడన్నారు.

అసెంబ్లీలో నేలపై కూర్చొని ధర్నా చేస్తే రాత్రికి రాత్రి రైతులకు అరకొరగా పంటల బీమా సొమ్ము జమ చేశాడన్నారు. జగన్‌వి అన్నీ తప్పుడు విధానాలు.. తప్పుడు పనులే అన్నారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి ప్రకటించానని, రాయలసీమ నుండి పాతపట్నం వరకు తిరిగానన్నారు. పగటిపూట ఎండతో, రాత్రిపూట గాలితో విద్యుత్ తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించానన్నారు. దానికితోడు పంప్డ్ ఎనర్జీ తయారుచేస్తే యూనిట్ విద్యుత్ రూ.2 నుండి రూ.3కే లభిస్తుందన్నారు. అప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయన్నారు.

రాబోయే రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి పెంచి, నాణ్యమైన విద్యుత్ ను అందరికీ చౌకగా అందించేది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. మద్యపాన నిషేధం హామీని జగన్ అమలు చేయలేదన్నారు. మీ కుటుంబాలను మద్యానికి బానిసలను చేసి, అలా వచ్చే సొమ్ముతో నెట్టుకొస్తున్నాడన్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేశాడని, మీకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుక అమ్ముకుంటున్నాడన్నారు. ఈ ముఖ్యమంత్రి ప్రతిదానిలో దోపిడీ చేస్తున్నాడన్నారు. జగన్ రెడ్డి బ్రాందీ షాపులు పెడితే, తాను అన్నాక్యాంటీన్లు పెడతానని, ఇదీ తమ ఇద్దరి మధ్య తేడా అన్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment
  • Comment
  • Preview
Loading