bengaluru loses nearly 20000 crore due to traffic mess
Telecast Date: 07-08-2023 Category: Political Publisher:  SevenTV

 

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య అంతా ఇంతా కాదు. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలంటే గంటలకొద్ది సమయం తీసుకుంటుంది. ట్రాఫిక్ అంతరాయాలు, వివిధ ప్రాంతాల్లో రద్దీ, సిగ్నళ్ల వద్ద వేచి ఉండటం, ప్రయాణికులకు సమయ నష్టం, ఇంధనం వృధా వంటి ఎన్నో ఇబ్బందులను బెంగళూరువాసులు చూస్తున్నారు. వీటి కారణంగా ఈ నగరం ప్రతి ఏడాది రూ.19,725 కోట్ల మేర నష్టపోతోందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రముఖ ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్ శ్రీహరి, అతని బృందం... రోడ్డు ప్లానింగ్, ఫ్లైఓవర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, మౌలిక సదుపాయాల లోటు వంటి అంశాలపై అధ్యయనం చేసి, ఈ విషయాన్ని వెల్లడింది.


60 ప్లైఓవర్లు ఉన్నప్పటికీ పై ఇబ్బందులతో బెంగళూరు వినియోగదారులకు దాదాపు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు వెల్లడించింది. బెంగళూరువాసులకు సమయం వృథా కావడం, ఇంధన నష్టం, వాహనాలపై ఆధారపడి జీవించే వారికి ఆదాయ నష్టం వాటిల్లుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఐటీ సెక్టార్‌లో పెరిగిన ఉపాధి వృద్ధి ఫలితంగా హౌసింగ్, విద్యతో పాటు వివిధ సౌకర్యాల విషయంలో వృద్ధి కనిపించిందని ఈ నివేదిక వెల్లడించింది. జనాభా 14.5 మిలియన్లకు చేరుకోగా, వాహనాల సంఖ్య 1.5 కోట్లకు చేరుకుంది. వివిధ సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన సరిపోలేదని పేర్కొంది. ఇది ట్రాఫిక్ అంతరాయాలకు కారణమవుతున్నట్లు తెలిపింది.

వాహనాల పెరుగుదలకు అనుగుణంగా రోడ్ల విస్తీరణం కనిపించడం లేదని ఈ నివేదిక పేర్కొంది. బెంగళూరులో మొత్తం రోడ్డు పొడవు 11,000 కిలో మీటర్లుగా ఉందని, ఇది ఇక్కడి ప్రయాణికులకు సరిపోవడం లేదని వెల్లడించింది. జనాభా పెరుగుదల, పెరుగుతున్న ఉద్యోగ వేగానికి ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు సరిపోవడం లేదని శ్రీహరి, అతని బృందం పేర్కొంది. బెంగళూరు నగరానికి రేడియల్ రోడ్లు, రింగ్ రోడ్లు అవసరమని శ్రీహరి అభిప్రాయపడ్డారు. ఎస్టీఆర్ఆర్ ఎప్పటి నుండో ఉందని, కానీ భూసేకరణ సమస్య కారణంగా ఆలస్యమైందని, దీనికి తోడు ఇప్పుడు నిర్మాణం, నిర్వహణ ఖర్చులు పెరిగాయన్నారు.

 

రానున్న పాతికేళ్లను దృష్టిలో పెట్టుకొని రోడ్ ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి భూగర్భ ఆధారిత రహదారి వ్యవస్థను కూడా నిపుణులు సూచిస్తున్నారు. మెట్రోలకు, బస్సులకు కూడా భూగర్భ ఆధారిత రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఫుట్ పాత్‌లు పాదచారులు నడవడానికి ఉపయోగిస్తారని, కాబట్టి రోడ్ సైడ్ పార్కింగ్‌ను తొలగించాలని ఈ అధ్యయనం తెలిపింది. బెంగళూరులో పార్కింగ్ లేకుండా ఏ రోడ్డు కూడా కనిపించడం లేదని శ్రీహరి అన్నారు. మెట్రో, మోనో రైలు, అధిక సామర్థ్యం కలిగిన బస్సుల రవాణా ప్రక్రియలపై దృష్టి సారించాలన్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading