BRS Government On Hyderabad Metro Extension
Telecast Date: 01-08-2023 Category: Political Publisher:  SevenTV

 

ఎప్పటికప్పుడు కొత్త కలల్ని పరిచయం చేస్తూ.. తాను మాత్రమే చేయగలనన్న భావనకు గురి చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించిన నేత తెలంగాణలో మరెవరూ కనిపించరు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగింట్లోకి వచ్చిన వేళ.. ఆయనకు మహానగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య హటాత్తుగా గుర్తుకు వచ్చింది. తాను అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో పెండింగ్ లో ఉన్న ఐదు కిలోమీటర్లు (పాతబస్తీ) మెట్రోను పూర్తి చేయకున్నా.. రానున్న నాలుగేళ్ల వ్యవధిలో రూ.69వేల కోట్లు (సరిగ్గా చెప్పాలంటే రూ.69,100) భారీ ఖర్చుతో మొత్తంగా రూ.278 కి.మీ. మేర మెట్రో నిర్మాణం చేపడతామంటూ ఆయన ఊరిస్తున్నారు.

అంత భారీ మొత్తం ఎలా? అన్న సందేహానికి ముందే ఆయన సమాధానం ఇచ్చేస్తున్నారు. కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమని.. తమకున్న బలంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తెస్తామన్నది ఆయన మాట. ఒకవేళ సాధ్యం కాకుంటే అన్న సందేహానికి ఆయనే సమాధానం ఇచ్చేస్తూ.. సొంతంగా నిర్మిస్తామన్న మాటను కేబినెట్ భేటీలో స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. హైదరాబాద్ మహానగరానికి మెట్రోతో ప్రజారవాణా అవసరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించినట్లుగా తాజా ప్రతిపాదనను చూస్తే అర్థమవుతుంది.

ఇప్పటికే ఉన్న మెట్రో మార్గాలకు అదనంగా ఎయిర్ పోర్టుకు అనుసంధానం చేసేలా మెట్రో ప్రాజెక్టును ఇప్పటికే చేపట్టారు. అది కాకుండా.. కొత్తగా ఎనిమిది మార్గాలతో పాటు అవుటర్ రింగ్ రోడ్డు వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించాలన్న కొత్త కలను ఆవిష్కరించారు. ఇందుకు తగ్గట్లు కేబినెట్ భేటీలో డిసైడ్ చేవారు. ఫార్మాసిటీ - శంషాబాద్ ఎయిర్ పోర్టు - జల్ పల్లి - తక్కుగూడ - కందుకూరు వరకు మెట్రోను విస్తరించనున్నారు.


హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తే వరదలు పోటెత్తటం.. ట్రాఫిక్ సమస్య తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఆ సమస్యకు శాశ్విత పరిష్కారాన్ని కనుగొనే దిశలో భాగంగా మహా మెట్రో ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. నగరం ఎంత పెరిగినా.. ఎన్ని పరిశ్రమలు వచ్చినా లక్షలాది మంది ప్రజలు వచ్చినా తట్టుకునేలా మహా మెట్రోను డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే 70కిలోమీటర్లు ఉన్న మెట్రోకు అదనంగా.. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 31 కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేయటం తెలిసిందే.


మూడో దశ ను 'ఏ'.. 'బి' గా విభజించారు. 'ఏ' లో మొత్తం 8 లైన్లలో 142 కిలోమీటర్ల దూరానికి రూ.39,190 కోట్ల మొత్తాన్ని.. మూడో దశ 'బి'లో నాలుగు లైన్లలో మొత్తం 136కి.మీ. దూరాన్ని రూ.20,810 కోట్ల ఖర్చుతో నిర్మించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. మూడో దశ ఏ, బిలకు సంబంధించిన ప్లాన్ విషయానికి వస్తే ఇలా ఉన్నాయి.


మూడో దశ 'ఏ' 1. బీహెచ్ఈఎల్ - పటాన్ చెర్వు - ఇస్నాపూర్ (8 స్టేషన్లతో 13కి.మీ.) 2. ఎల్బీనగర్ -హయత్ నగర్ - పెద్ద అంబర్ పేట (8 స్టేషన్లతో 13కి.మీ.)

3. శంషాబాద్ - కొత్తూరు - షాద్ నగర్ (6 స్టేషన్లతో 28కి.మీ.) 4. ఉప్పల్ - ఘట్ కేసర్ - బీబీనగర్ (10 స్టేషన్లతో 25కి.మీ.) 5. ఎయిర్ పోర్టు -తుక్కుగూడ - కందుకూరు (5 స్టేషన్లు 8 కి.మీ.) 6. తార్నాక - ఈసీఐఎల్ (5 స్టేషన్లు 8.కి.మీ.) 7. జేబీఎస్ - తూంకుంట (డబుల్ ఎలివేటెడ్) (13 స్టేషన్లు 17కి.మీ.) 8. ప్యారడైజ్ - కండ్లకోయ (డబుల్ ఎలివేటెడ్) (10 స్టేషన్లు 12కి.మీ.) - ఒకటి నుంచి ఆరు వరకు ఎలివేటెడ్ కారిడార్లు


మూడో దశ 'బి' 1. శంషాబాద్ సర్కిల్ - తుక్కుగూడ- బొంగులూరు - పెద్ద అంబర్ పేట (40కి.మీ.) 2. పెద్ద అంబరర్ పేట - ఘట్ కేసర్ - శామీర్ పేట - మేడ్చల్ (45కి.మీ.) 3. మేడ్చల్ - దుండిగల్ - పటాన్ చెరు (29కి.మీ.) 4. పటాన్ చెరు - కోకాపేట - నార్సింగ్ (22కి.మీ.)


తొలిదశలో 69.2 కి.మీ. మెట్రోను మూడు మార్గాల్లో చేపట్టటం తెలిసిందే. ఇందులో మిగిలిన 5.5 కి.మీ. పాతబస్తీని పూర్తి చేయాల్సి ఉంది. దీన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రెండో దశ ఏలో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31కి.మీ. మార్గానికి సంబంధించిన నిర్మాణం టెండర్ దశలో ఉన్నట్లుగా చెప్పిన మంత్రి కేటీఆర్.. రెండోదశ బిలో బీహెచ్ఈఎల్ - మియాపూర్ - గచ్చిబౌలి - లక్డీకాపూల్ కు చెందిన 26కి.మీ. ప్రాజెక్టు ఉంది. అదే విధంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ కు అనుసంధానం చేసే 5కి.మీ. ప్రాజెక్టు ఉంది. ఈ రెండింటికి కలిపి రూ.9100 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. దీనికి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి డీపీఆర్ పంపింది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment
  • Comment
  • Preview
Loading