guntur kaaram telugu review
Release Date: 13-01-2024 Publisher:  SevenTV

 

విడుదల తేదీ : జనవరి 12, 2024

seventv రేటింగ్ : 3/5

నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు.

దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత: ఎస్. రాధా కృష్ణ

సంగీత దర్శకులు: తమన్ ఎస్

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటింగ్: నవీన్ నూలి

 

కథ :

రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా రమణ తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తల్లిగా దూరంగా పెరిగిన రమణ జీవితంలోకి మళ్ళీ పాతికేళ్ల తర్వాత తల్లి ప్రస్తావన వస్తోంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రమణ మళ్ళీ తన తల్లిని చేరుకున్నాడా ?, లేదా ?, అసలు వసుంధర ఎందుకు తన కొడుకుని దూరం పెట్టింది ?, ఈ దూరానికి కారణం ఎవరు ?, రమణ తండ్రి సత్యం (జయరామ్) పాత్ర ఏమిటి ?, ఈ మధ్యలో ఆముక్తమాల్యద (శ్రీలీల) తో రమణ ప్రేమ కథ ఎలా సాగింది ?, ఫైనల్ గా రమణ తన తల్లికి దగ్గర అయ్యాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.


ప్లస్ పాయింట్స్ :

భారీ అంచనాలతో వచ్చిన ఈ గుంటూరు కారం ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్ తోనూ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగింది. మహేష్ బాబు కామెడీ టైమింగ్‌ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. పైగా తన డైలాగ్ డెలివరీలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే మహేశ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. త్రివిక్రమ్ రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి.

ప్రధానంగా సినిమాలో ఫస్ట్ ఎపిసోడ్, మహేష్ – శ్రీలీల మధ్య వచ్చే లవ్ సీన్స్, మరియు కథను ఎలివెట్ చేస్తూ సాగిన మెయిన్ ట్రాక్, అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు, త్రివిక్రమ్ మార్క్ కామెడీ పంచ్‌ లు అండ్ మ్యానరిజమ్స్ సినిమాలో చాల బాగున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల నటన పరంగా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. మీనాక్షి చౌదరి కూడా ఉన్నంతలో బాగానే నటించింది.

అలాగే కీలకమైన రమ్యకృష్ణ రోల్‌.. ఆ పాత్రలో ఆమె నటించిన విధానం ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు. వెన్నెల కిషోర్ తన కామిక్ హావభావాలతో కొన్ని చోట్ల నవ్వించాడు. అదేవిధంగా జగపతి బాబు, ఈశ్వరి రావు మరియు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

త్రివిక్రమ్ కామెడీతో పాటు యాక్షన్ తో ఆకట్టుకున్నప్పటికీ.. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మంచి కథాంశం తీసుకుని కూడా ఆయన కథనం విషయంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇంట్రెస్ట్ గా సాగని సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. అలాగే, మదర్ ట్రాక్ లోని సీన్స్ కూడా ఇన్ వాల్వ్ అయ్యే విధంగా లేవు.

ఇక కొన్ని సీన్స్ లో శ్రీలీల ఓవర్ యాక్టింగ్ చేస్తోన్న భావన కలుగుతుంది. పైగా సినిమాలో ఉన్న కామెడీని.. సినిమా మొత్తం దర్శకుడికి కంటిన్యూ చేసే స్కోప్ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో ప్రధాన సీక్వెన్స్ లు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాలో మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా త్రివిక్రమ్ పంచ్ లు పేలినా.. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం నిరాశ పరిచింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. అయితే కథలో బలం లేకపోయినా, కామెడీ ఎలిమెంట్స్ తో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు తమన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాలో విజువల్ పరంగా వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపధ్య సంగీతం కూడా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్నిచోట్ల స్లోగా సాగిన కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.

తీర్పు :

ముందుగానే చెప్పుకున్నట్లు ఎన్నో భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ ‘గుంటూరు కారం’, మహేష్ అభిమానులను మాత్రం ఆకట్టుకుంటుంది. అలాగే, త్రివిక్రమ్ మార్క్ కామెడీ, మహేష్ బాబు నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే, బలమైన కథ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగడం, దీనికితోడు నాటకీయ సన్నివేశాలు, అలాగే కొన్ని చోట్ల స్లో కథనం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఐతే, మహేశ్ బాబు తన స్టైలిష్ మాస్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను బాగానే అలరిస్తారు. ఓవరాల్ గా ఈ చిత్రం మహేష్ బాబు ఫాన్స్ ను మాత్రం ఆకట్టుకుంటుంది.


seventv rating: 3/5

 

 

 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading